
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకులంలో పని చేసే సెక్యూరిటీ గార్డే పిల్లలకు వండిపెడుతున్నారు. ఇద్దరు హెడ్ కుక్‌లు విధులకు రాకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.గురుకులంలో 5 నుంచి 10వ తరగతి దాదాపు 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. రంజాన్ మాసంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులు ప్రతి రోజు ఉపవాసం ఉంటున్నారు.
అయితే వీరికి సహర్, ఇఫ్తార్ సమయంలో సరిగా భోజనం అందడం లేదని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు హెడ్ కుక్‌లు విధులకు ఎగనామం పెట్టడంతో స్కూల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తితో వంటలు చేయిస్తున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ సత్యంను వివరణ కోరగా హెడ్ కుక్‌లు లేకపోవడంతో వేరేవారితో వంట పనులు చేయిస్తున్నా మని, భోజన విషయంలో స్టూడెంట్లకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి గురుకులానికి రెగ్యులర్ హెడ్ కుక్ లను నియమించాలని స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.